Thursday, 23 February 2023

చిన్నారిపై అత్యాచారం కేసులో దోషికి 25 ఏళ్ల జైలు శిక్ష!. కేసు దర్యాప్తులో టీఎస్‌ఆర్టీసీ జేడీ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌ది కీలకపాత్ర. ఆయనను అభినందించిన టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌*

 
16 నెలల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో కొత్తగూడెం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పోక్సో కేసులో దోషికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని లేని పక్షంలో ఆరు నెలల కఠిన కారాగార శిక్ష అదనంగా ఉంటుందని స్పష్టం చేసింది. అప్పటి భద్రాచలం ఏఏస్పీ, ప్రస్తుత టీఎస్‌ఆర్టీసీ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌, ఐపీఎస్‌  స్వయంగా ఈ కేసును దర్యాప్తు చేశారు. నిందితుడికి శిక్ష పడేలా కేసులో ఆధారాలను సేకరించారు. కోర్టు త్వరితగతిన ట్రయల్‌ నిర్వహించేలా చొరవచూపారు. 2018 జూన్‌లో భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలానికి చెందిన 22 ఏళ్ల అజ్మీరా సాయికిరణ్‌ అనే వ్యక్తి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ పాప తల్లిదండ్రులు శుభకార్యం కోసం వేరే ఊరు వెళ్లగా, అప్పుడు వారి బంధువు వద్ద ఉన్న పాపను ఆడిస్తానని చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై దుమ్ముగూడెం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది. 
చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడికి శిక్ష పడేలా పకడ్బందీగా కేసును దర్యాప్తు చేసిన సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ గారు అభినందించారు. హైదరాబాద్‌ బస్‌భవన్‌లో గురువారం ఆయనను సన్మానించారు. బాధిత కుటుంబానికి వేగంగా న్యాయం అందేలా చర్యలు తీసుకున్న సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌ను ప్రశంసించారు. కెరిర్‌ ప్రారంభంలోనే పొక్సో కేసులో పక్కా సాక్ష్యాధారాలను సేకరించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని కొనియాడారు. పోక్సో కేసుల్లో నిందితులకు శిక్ష పడటమనేది ప్రస్తుతం ఒక సవాల్‌గా మారిందన్నారు. కానీ.. దుమ్ముగూడెం కేసులో నిందితుడికి 25 ఏళ్ల శిక్ష ఖరారు కావడం చారిత్రాత్మకమన్నారు. 
"పిల్లలు సమాజ ఆస్తి. వారిని క్షేమంగా చూసుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉంది. చిన్నారులను స్వేచ్ఛగా ఎదిగేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తూనే.. వారికి గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌పై తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి. పిల్లలకు రక్షణ ఛత్రంగా ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేసి నిందితులకు శిక్ష పడేలా పోలీస్‌ అధికారులు చర్యలు తీసుకోవాలి. పోక్సో కేసులనూ సీరియస్‌గా తీసుకుని కోర్టుల్లో వేగంగా ట్రయల్‌ జరిగేలా చూడాలి. తన వంతు బాధ్యతగా పొక్సో కేసులో నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకున్న సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌ చొరవ ప్రశంసనీయం." అని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌  గారు అన్నారు. ప్రతి ఒక్కరూ చిన్నారులపై జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పాటుపడాలన్నారు.

చిన్నారిపై అత్యాచార కేసులో నేరస్తుడికి 25 ఏళ్ల జైళ్ల శిక్ష ఖరారు కావడంపై టీఎస్‌ఆర్టీసీ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌, ఐపీఎస్‌ సంతోషం వ్యక్తం చేశారు. తన మొదటి సంచలన కేసులోనే చారిత్రాత్మక తీర్పు రావడం సంతోషంగా ఉందన్నారు. తనను అభినందించి సన్మానించిన సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌, ఆర్టీసీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసులో తన వృత్తి ధర్మాన్ని నిర్వహించానని, ఈ అనుభవంతో భవిష్యత్‌లో మరింత సమర్థవంతంగా పనిచేస్తానని చెప్పారు. ఈ కేసు దర్యాప్తునకు సహకరించిన సీఐ బాలకృష్ణ, హెడ్‌ కానిస్టేబుళ్లు ఎండీ ముజామిల్‌, రాజేంద్ర కుమార్‌, హరిగోపాల్‌, కానిస్టేబుల్‌ హనుమంతరావు, అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పీవీడీ లక్ష్మిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వినోద్ కుమార్, సీపీఎం కృష్ణకాంత్‌, సీటీఎం జీవనప్రసాద్‌, ఐటీ చీఫ్‌ ఇంజనీర్‌ రాజశేఖర్‌, సీటీఎం(ఎం అండ్‌ సీ) విజయ్‌ కుమార్‌, చీఫ్‌ మేనేజర్‌(ఫైనాన్స్‌) విజయ పుష్ఫ, తదితరులు పాల్గొన్నారు. 

Monday, 20 February 2023

*టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు వచ్చేస్తున్నాయ్.. !**▪️మంత్రి పువ్వాడ సూచనలతో మార్చిలో అందుబాటులోకి 16 ఏసీ స్లీపర్ బస్సులు. **▪️కొత్త బస్సును పరిశీలించి, ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలపై ఆరా సంస్ధ ఎండి ఆరా.


ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అందుబాటులోకి తీసుకువస్తోంది. 
ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే కొత్త సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, సీటర్ కమ్ స్లీపర్ బస్సులను ప్రారంభించిన సంస్థ.. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు హైటెక్ హంగులతో ఏసీ స్లీపర్ బస్సులను రూపొందించింది. 
ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు మార్చి నెలలో అందుబాటులోకి రాబోతున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను సంస్థ నడపనుంది. 
నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు లహరిగా సంస్థ నామకరణం చేసింది.
ఆయా బస్సులను మార్చి నెల నుండి అందుబాటులోకి తీసుకురావాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఇప్పటికే సంస్థకు ఆదేశాలు ఇచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఅర్ గారి ఆదేశాల మేరకు ప్రజా రవాణాను మరింత పటిష్ట పరచి, సేవలను మరింత విస్తరించాలని సంకల్పంతో టిఎస్ ఆర్టీసి ని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.
ఈ మేరకు హైదరాబాద్‌ లోని బస్ భవన్ ప్రాంగణంలో కొత్త నమూనాతో ఏసీ స్లీపర్ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, పరిశీలించారు. 
బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా బస్సులను ప్రారంభించి.. ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
తెలంగాణలో మొదటిసారిగా అందుబాటులోకి తీసుకువస్తోన్న టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించ‌గ‌ల‌ద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. 
ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి. రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) పీవీ ముని శేఖర్, చీఫ్ పర్సనల్ మేనేజర్ (సీపీఎం) కృష్ణ కాంత్, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ (సీఎంఈ) రఘునాథ రావు, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్(సీటీఎం) జీవన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. 

*▪️బస్సు ప్రత్యేకతలివే..*!
12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్‌ 15, అప్పర్ 15తో 30 బెర్తుల సామర్థ్యం ఉంది. 
బెర్త్ ల వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే  సదుపాయంతో పాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుయి
ప్రతి బెర్త్‌ వద్ద రీడిండ్‌ ల్యాంప్‌ లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఏసీ స్లీపర్‌ బస్సుల్లో వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు పానిక్‌ బటన్‌ సదుపాయం కల్పించారు. 
వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూంనకు అనుసంధానం చేయడం జరుగుతుంది.  ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ స్లీపర్‌ బస్సుల్లో వైఫై సదుపాయాన్ని కల్పించారు. 
ప్రతి బస్సులోనూ రెండు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవి కేబిన్‌లో, బస్సు లోపల ఉన్నాయి. బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా ఉంటుంది. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. 
అందులో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌)ను ఏర్పాటు చేయడం జరిగింది. 
ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం బస్సుల్లో  ఉంటుంది.

తిరుమల జాపా(బా)లి హనుమకు గదను సమర్పించిన భక్తులు...

తిరుమలలో ప్రముఖమైనది. చుట్టూ పెద్ద పెద్ద కొండలు.. ఎత్తయిన వృక్షాలు.. ఇలా పచ్చటి లోయలో వెలసిన ప్రాకృతిక పర్ణశాల జాబాలి తీర్థం. దీనినే జాపాలి తీర్థంగా కూడా పిలుస్తుంటారు. ఇక్కడ ఆంజనేయుడు స్వయంభువుగా వెలిశాడని భక్తుల విశ్వాసం. ఇట్టి మహిమాన్విత క్షేత్రం ప్రకృతి రమణీయత కళ్ళకు కట్టి రామభక్త లంకా భీకర అసుర సంహారక హనుమకు ఫిబ్రవరి 19వతేది ఆదివారం అనంతాళ్వాన్ తోట ఆధ్యుడు అయిన శ్రీ అనంతాళ్వాన్ 969వ అవతార విశేష ఉత్సవం  సందర్భంగా.. అనంతాళ్వాన్ 26వ తరం వారసులు శ్రీమాన్ టి.ఏ.పి.రంగాచారి ఆశీస్సులు అందుకున్న అనంతరం  విజయవాడకు చెందిన పివి రామిరెడ్డి (అనంతళ్వాన్ దివ్య చరిత్ర పుస్తక రచయిత) జగదీష్,  కత్తి సాయి కృష్ణ, నంబూరు నరసింహారావు, రావుల రాజా, భక్త బృందం "గద"ను సమర్పించారు.

అనంతరం ఊరేగింపు గా జపాలి తీర్థం  తీసుకుని వెళ్లి అర్చకులకు అందజేశారు.. అర్చకులు అ "గద"ను స్వామి కి కుడి వైపున వుంచి ప్రత్యేక పూజలు చేశారు.. అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగిన కార్యక్రమంలో సమర్పకులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు...

దశాబ్దాలుగా ఈ ఆలయం హాథీరామ్‌జీ మఠం ఆధ్వర్యంలో నిర్వహణ పూజాధికాలు సాగుతున్నాయి. తిరుమల శ్రీవారి దర్శించ వచ్చిన భక్తుల్లో చాలామంది జాపాలి ఆంజనేయుణ్ణి దర్శించుకుంటారు. దుష్ట గ్రహ నివారణకు, ఆరోగ్య సిద్ధికి స్వామిని సేవిస్తారు.
తిరుమల శిఖరాలపై ధర్మపథ, జ్ఞానపథ, ముక్తిపథ, భక్తిపథ తీర్థాల పేరిట 108 పుణ్య తీర్థాలు ఉన్నాయి. వాటిలో జాబాలి తీర్థం
జాపాలి తీర్థం తిరుమల శ్రీవారి ఆలయానికి వాయవ్య దిశలో మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుమల నుంచి పాపవినాశనం వెళ్లే దారిలో మధ్యలో దిగాలి. అక్కడి నుంచి పావు కిలోమీటరు దూరం మెట్ల మార్గంలో వెళ్లాలి. తిరుమలలోని బాట గంగమ్మ ఆలయం పక్కన ఉన్న దారి గుండా... కాలినడకన జాపాలి ఆంజనేయుడి సన్నిధికి చేరుకోవచ్చు. కాకపోతే, దట్టమైన అరణ్యం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గాన స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు అపర రేణుక అంశగా భావించే బాట గంగమ్మను పూజించి, దారిలో ఏ ఇబ్బందీ లేకుండా చూడాలని వేడుకుంటూ ఉంటారు.
జాబాలి తీర్థం పరిసరాల్లో ఆధ్యాత్మికత తొణికిసలాడుతుంటుంది. చుట్టూ చిక్కని పచ్చదనం.. మధ్యలో కోనేరు... చూడముచ్చటగా ఉంటుంది. జాబాలి అనే మహర్షి ఆశ్రమం ఇక్కడ ఉండేదట. భగవంతుని కోసం ఆయన కఠోర తపస్సు ఆచరించిన పుణ్య ప్రదేశం ఇది. అందుకే ఈ తీర్థం.. జాబాలి తీర్థంగా ప్రసిద్ధిగాంచింది. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి లక్ష్మణ సమేతంగా ఇక్కడి జాబాలి ఆశ్రమానికి వచ్చాడని చెబుతారు. ఇక్కడి తీర్థంలో రాముడు స్నానమాచరించాడని అంటారు. ఆ తీర్థాన్నే ‘రామకుండం’గా పిలుస్తున్నారు. ఈ తీర్థ ప్రాశస్త్యం స్కాంద, వరాహ పురాణాల్లోనూ కనిపిస్తుంది.
జాబాలి తీర్థంలో వెలసిన ఆంజనేయుని ఆలయం నిత్యం భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంటుంది. అంజనాదేవికి.. స్వామి హనుమ ఇక్కడే జన్మించారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఆంజనేయుడు స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. ఉత్తరాభిముఖంగా ఉన్న కపీశ్వరుడిని పూజించడం ద్వారా గ్రహ బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. జాపాలి తీర్థాన్ని ‘ఆనందాశ్రమం’గా కూడా అభివర్ణిస్తారు. ఇక్కడ స్వామి దర్శన మాత్రం చేత.. మానసిక ఆనందం సిద్ధిస్తుందని నమ్మకం.తప్పకుండా దర్శించవలసిన అద్భుతమైన ఆంజనేయ స్వామి వారి జన్మస్థల క్షేత్రం శివుడు రుద్రాంశలో ఆంజనేయ స్వామిగా అవతరించడానికి ముందే ఒక మహా భక్తునికి ఆంజనేయ స్వామిగా దర్శనమిచ్చిన స్థలం.

ఆంజనేయ స్వామి వారి తల్లి అంజనాదేవి కఠిన తపస్సు చేసిన పుణ్యస్థలం.
పరమ పవిత్ర తిరుమల క్షేత్రంలో శ్రీరాముడు స్నానమాచరించిన  రామగుండం తో పాటు అనేక విశేషాలకు నెలవైన ఆ  క్షేత్రమే  *జపాలి క్షేత్రం.*
స్థల పురాణం
త్రేతాయుగంలో దుష్ట సంహారం చేయడానికి శ్రీ మహావిష్ణువు శ్రీ రామచంద్ర స్వామి అవతారం ఎత్తగా, శ్రీరాములవారికి సహాయము చేయడానికి శివుడే / శివుడి అంశనే ఆంజనేయ స్వామిలా అవతరించారని ప్రతీతి
అయితే *జాబాలి* అనే మహర్షి హనుమంతుడి అవతారనికంటే ముందే ఆ రూపాన్ని దర్శించి, ప్రసన్నం చేసుకోవాలని తలచి అనేక చోట్ల ఘోర తపస్సు చేస్తూ తిరుమల కొండపై అనేక జప / హోమాలు చేసిన పిమ్మట స్వామి సంతోషించి భవిష్యత్తులో అవతరించబోయే హనుమంతుని రూపాన్ని ఇక్కడ స్వయంభుగా వెలసి జాబాలి మహర్షికి చూపించినాడని స్థల పురాణం.
జాబాలి మహర్షి జపాలకు మెచ్చి స్వామి స్వయంభుగా వెలసినందువల్ల ఈ క్షేత్రం జాపాలి క్షేత్రంగా పిలవబడుతోంది.
ఈ క్షేత్రంలోనే పరమ పవిత్రమైన తీర్థాలైన రామగుండం, సీతాగుండం, ధృవతీర్థం వంటి తీర్థాలు ఉండటం వల్ల జపాలి తీర్థం అయ్యింది.
శ్రీరాముడు రావణాసురున్ని సంహరించి, సీతా మాత సమేతంగా అయోధ్య వెళుతూ ఇక్కడ స్నానామాచరించినారట. అందుకే శ్రీరాముల వారు స్నానం చేసిన తీర్థాన్ని రామగుండం (ఆలయం ఎదురుగా ఉన్న తీర్థం ) అనీ, సీతమ్మవారు స్నానమాచరించిన తీర్థాన్ని సీతాగుండం (ఆలయం వెనుక వైపు) అనీ పిలుస్తారు వినీల ఆకాశంలో ధృవతార గా వెలుగొందుతున్న భక్త ధృవుడు తపమాచరించినాడట. ఇప్పటికీ ఇక్కడ ధృవ తీర్థం నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటినే ఆంజనేయస్వామి వారి కైంకర్యాలకు  వినియోగిస్తున్నారు. ఈ తీర్థములోని నీరు అనేకఔషధ గుణాలు కలిగి ఉన్నవని ప్రతీతి.ఆలయానికి పశ్చిమాన ఉన్న తీర్థాన్ని హనుమాన్ తీర్థం అని పిలుస్తున్నారు.

ఆలయ విశిష్టత .
ఎటువంటి కష్టానష్టాలున్నా స్నానం చేసి తడిబట్టలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కష్టాలు తీరుతాయని విశ్వాసం. జన్మ శని కలిగినవారు తమ పుట్టినరోజు నాడు ఇక్కడ స్వామి వారికి పూజ, అభిషేకము చేస్తే శని ప్రభావం వల్ల కలిగే అనేక బాధలు కలగవు అని మరో విశ్వాసం. అలాగే పంచమహా పాతకాలు, భూత, ప్రేత, పిశాచాది బాధలు ఉన్నవారు ధృవ తీర్థంలో స్నానామాచారిస్తే ఆ కష్టాలు తీరుతాయని స్కాందపురాణంలోని వేంకటాచల మహాత్మ్యంలో చెప్పబడింది
జాబాలి మహర్షి ఇక్కడి రామగుండంలో స్నానమాచరించి వాక్కు దోష విముక్తుడైనాడట
శ్రీవారి ప్రియ భక్తులైన
శ్రీ హాథీరాంబావాజీ కూడా ఇక్కడే సంచరిస్తూ తపస్సు చేసుకునేవారట.
ఈ ఆలయం ప్రస్తుతం శ్రీ హాథీరాంజీ మఠం వారి ఆధీనంలో ఉన్నది
ఆలయం ఎదురుగా ఉన్న చెట్టు భాగం వినాయకుడి ఆకారంలో ఉండటం మరో విశేషం.
తిరుమల వెళ్లినపుడు తప్పకుండా జపాలి క్షేత్రాన్ని దర్శించుకోండి.

Saturday, 18 February 2023

కమనీయం కళ్యాణ శ్రీనివాసుని రధోత్సవం...అడుగడుగునా భక్తుల మంగళ హరతులు

తిరుపతి కళ్యాణ శ్రీనివాసులు భక్తుల మనోరధాన్ని అధిరోహించాడు రధారవుడై శ్రీనివాస మంగాపురంలో వారిని కరుణించాడు  శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శనివారం ఉదయం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ర‌థాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఉదయం 7.10 నుండి 8.30 గంటల వరకు ఉభయదేవేరులతో కూడి శ్రీవారు రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజు ఉదయం రథోత్సవం జరుగుతుంది. శరీరం - రథం, ఆత్మ- రథికుడు, బుద్ధి - సారథి, మనస్సు - పగ్గాలు, ఇంద్రియాలు - గుర్రాలు. ఇంద్రియ విషయాలు రథం నడిచే త్రోవలు. రథం రథికుణ్ణి చూడమంటుంది. రథికుడు పగ్గాల సాయంతో గుర్రాలను అదిలిస్తూ, దారుల వెంబడి పరుగులు తీయించినట్లే ఇంద్రియాలతో, మనస్సుతో కూడిన ఆత్మవిషయాల్ని అనుభవిస్తూ ఉంటుంది. రథోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన స్వామివారి రథాన్ని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది.  రథస్తుడైన మాధవుడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదన్నారు పెద్దలు.

Monday, 13 February 2023

ముత్య‌పుపందిరి వాహనంపై కాళీయమర్ధనుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

 శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీనివాసుడు కాళీయమర్ధనుడి అలంకారంలో ముత్య‌పుపందిరి వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ముత్య‌పు పందిరి - స‌క‌ల సౌభాగ్య సిద్ధి
    ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం. అందుకే శ్రీనివాసుడు మూడో రోజు రాత్రి  ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్నిపెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణచక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు - రత్నాల వల్ల కలిగే వేడినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.

సింహ‌ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి


తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన సోమవారం రాత్రి శ్రీ సోమస్కందమూర్తి సింహ వాహనంపై అభ‌య‌మిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.మృగరాజు సింహం. దేవతల్లో అత్యంత ఉత్కృష్టుడు పరమేశ్వరుడు. భక్తుల హృదయం గుహ వంటిది. ఆ గుహలో సింహం వంటి ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంచుకుంటే జీవుడు ఏ భయాన్ని పొందడు.  మృగరాజు వంటి శివపరమాత్మ కొలువై అభయమిచ్చి జీవనాన్ని పాలిస్తుంటే, అరిషడ్వర్గాలనే క్షుద్రమృగాల భయం ఉండదు.
ఆకట్టుకున్న సంగీత కార్యక్రమాలు
      ఆలయం వద్ద గల వేదికపై ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, నాదస్వరం పాఠశాల, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. 
      సాయంత్రం ఎస్వీ నాదస్వర పాఠశాల ఉపాధ్యాయులు శ్రీమతి రవిప్రభ నాదస్వరం, శ్రీ చంద్రశేఖర్ డోలు బృందం మంగళధ్వని వినిపించారు. ఆ తర్వాత శ్రీ కె.సుధాకర్ బృందం గాత్ర సంగీతం, శ్రీమతి బి.చిన్నమదేవి బృందం గాత్ర సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో శ్రీ‌ కల్యాణ వేంకటేశ్వరస్వామి


తిరుపతి : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం ఉదయం 8 గంట‌లకు అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో సింహ‌ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
సింహ వాహనం - ధైర్య‌సిద్ధి
 శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు చెబుతున్నారు.