ఖమ్మం, నవంబర్ 1: ఖమ్మం కలెక్టర్ గౌతమ్ కుంచే పట్టారు. ఎన్నికల్లో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు నిచ్ఛారు.
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో జరిగిన స్వీప్ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ పాల్గొన్నారు.ఆర్వీబి పై పాఠశాల, కళాశాలల విద్యార్థులచే ఓటరు అవగాహన పై చేపట్టిన వాల్ పెయింటింగ్స్ ను పరిశీలించారు. కలెక్టర్ స్వయంగా బ్రష్ పెట్టి పెయింటింగ్ చేశారు. ఆర్వోబి రెండువైపులా ఓటరు అవగాహన పెయింటింగ్స్ చేపట్టాలన్నారు. విద్యార్థులను ఓటు హక్కు ఉన్నది, లేనిది అడిగి,ఓటు ఉన్నవారు తప్పనిసరిగా నవంబర్ 30న తమ ఓటు వేయాలని అన్నారు. ఓటు ప్రాముఖ్యత పై విద్యార్థులను చైతన్య పరచి, ప్రతి విద్యార్థి తమ కుటుంబం, స్నేహితులు, చుట్టుప్రక్కల వాళ్లందరికీ అవగాహన కల్పించి, డబ్బు, మద్యం, ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా, స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఓటు వేసేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రతిచోటా ఓటుపై చర్చ జరగాలని ఆయన తెలిపారు. ఓటుహక్కు విషయంలో దేశంలోని ప్రతి ఒక్కరూ సమానమని, ప్రతి ఒక్కరికి ఒకే ఓటు ఉంటుందని, అందరికి రాజ్యాంగం ప్రకారం సమాన స్వేచ్ఛ, హక్కులు ఉంటాయని అన్నారు. సి విజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ, అక్రమాలు దృష్టికి వస్తే సి విజిల్ యాప్ ద్వారా అధికారుల దృష్టికి తేవాలని ఆయన అన్నారు. నైతికతతో ఓటు వేసే సామాజిక బాధ్యతను మరవకూడదని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మధిర నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, మధిర ఎంపిడిఓ సిలార్ సాహెబ్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మునిసిపల్ కమీషనర్ రమాదేవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment