Tuesday, 2 September 2025

*విపత్తు నివారణ పనులపై సమగ్ర నివేదిక పంపండి..... సీఎం రేవంత్ రెడ్డి*


ఖమ్మం, సెప్టెంబర్-1: భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం, విపత్తు నిర్వహణ నిధుల క్రింద చేపట్టిన పనులు వివరాలతో కూడిన సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.భారీ వర్షాలు, వరద నష్టం, సహాయంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, దనసరి అనసూయ (సీతక్క), కోమటి రెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామ కృష్ణా రావు లతో కలిసి, హైదరాబాద్ నుండి సోమవారం అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో సమావేశంలో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి సిపి సునీల్ దత్, అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి, మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్యలు పాల్గొన్నారు.*సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ* భారీ వరదల కారణంగా దెబ్బతిన్న కాల్వలు, చెరువులు, కుంటల వివరాలు సేకరించాలని, వీటి మరమ్మత్తు, పునరుద్ధరణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, వరదల సహాయం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్న నేపథ్యంలో గత వరదల సమయంలో వినియోగించిన నిధులను పూర్తి స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ క్రింద జమ చేసి కేంద్రం నుంచి సహాయం రాష్ట్రానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధుల యూసీలను సమర్పించాలని సీఎం ఆదేశించారు. ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో 720 కోట్ల విలువ గల 1009 కిలో మీటర్ల ఆర్ అండ్ బి రోడ్లు, 11 కోట్ల విలువ గల జాతీయ రహదారులు, 374 కోట్ల విలువ గల పంచాయతీరాజ్ రోడ్లు, 32 కోట్ల 73  లక్షల విలువ గల   విద్యుత్ శాఖ పరికరాలు దెబ్బతిన్నాయని అన్నారు. భారీ వర్షాల సమయంలో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, చెరువుల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేయాలని సిఎం ఆదేశించారు.*రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామ కృష్ణారావు మాట్లాడుతూ* ఆగస్టు 26 నుంచి 28 తేదీలలో భారీ వర్షాలు మన రాష్ట్రంలో కురిసాయని ముఖ్యంగా మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురువడంతో ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలో 4124 కోట్ల రూపాయల వరకు నష్టం సంభవించిందని అన్నారు. ఈ వీడియో సమావేశంలో డిఆర్ఓ  ఏ. పద్మశ్రీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, ఎస్ఈ ఇరిగేషన్ వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి ఎస్ఈ యాకోబు, సిపిఓ శ్రీనివాస్, ఎన్డీఆర్ఎఫ్,, విద్యుత్ శాఖ, పంచాయతీ రాజ్, పోలీస్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment