Thursday, 11 June 2026

*చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడికి కఠిన శిక్ష పడాలి : బిఆర్ ఎస్ నేత తాజుద్దీన్,


*12 ఏళ్ల చిన్నారిపై జరిగిన అమానుష ఘటనను యావత్ సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిపై చట్ట ప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము.*

నేరం చేసిన వ్యక్తిని నిందితుడు అంటారు. నేరం చేసిన వ్యక్తి పేరు, మతం, కులం చూసి చట్టం పని చేయదు. *భారత రాజ్యాంగం ముందు అందరూ సమానమే. అందుకే నిందితుడు గౌస్ అయినా, బండి సంజయ్ కుమారుడైనా, మరెవ్వరైనా — నేరం చేస్తే ఒకటే చట్టం, ఒకటే శిక్ష ఉండాలి.*
ఈ దారుణాన్ని యావత్ ముస్లిం సమాజం ముక్తకంఠంతో ఖండిస్తోంది. చిన్నారిపై జరిగిన ఈ అమానుష ఘటనను ఏ మతం, ఏ సంస్కృతి, ఏ మానవత్వం కూడా సమర్థించదు. అయితే కొందరు వ్యక్తులు ఈ ఘటనను మతానికి ముడిపెట్టి విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం అత్యంత దురదృష్టకరం.

ముస్లిం సమాజం ఎప్పుడూ నేరస్థుడిని అతని మతం చూసి సమర్థించదు. నేరం చేసినవాడు ఎవడైనా శిక్ష పడాలనే వైఖరినే అనుసరిస్తుంది. అందుకే నిందితుడికి కఠిన శిక్ష విధించాలని ముస్లిం సమాజం మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది.

ఇక్కడ మరో విషయం కూడా సమాజం గుర్తించాలి. నెల క్రితం జరిగిన ఇలాంటి ఘటనల్లో నిందితులపై వేగంగా, కఠినంగా చర్యలు తీసుకుని ఉంటే, నేడు మరో గౌస్ లాంటి నిందితుడు ఇలాంటి దారుణానికి పాల్పడే ధైర్యం చేసి ఉండకపోవచ్చు. చట్టం ఆలస్యం కాకుండా కఠినంగా అమలు కావడం సమాజ రక్షణకు అత్యవసరం.

అలాగే నిందితుడిని కాపాడేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు ప్రచారం జరుగుతున్న ముగ్గురు ప్రముఖుల కులం కూడా నిందితుడి కులం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అప్పుడు ఈ వ్యవహారాన్ని కులం లేదా మతం కోణంలో చూడడం ఎంత తప్పో స్పష్టమవుతుంది. కొందరి వ్యక్తిగత చర్యలను మొత్తం సమాజానికి ఆపాదించడం బాధ్యతారాహిత్యం.

అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలకు కులం లేదు, మతం లేదు. బాధితుడి కన్నీటికి మతం ఉండదు. నిందితుడి నేరానికి కులం ఉండదు. కాబట్టి నేరాన్ని ఖండిద్దాం, నిందితుడికి శిక్ష కోరుదాం. కానీ సమాజంలో విద్వేషం, కుల-మత రాజకీయాలకు మాత్రం తావివ్వకూడదు.

సమాజ హితం కోరుకునే ప్రతి ఒక్కరూ న్యాయం పక్షాన నిలబడాలి. నేరస్థుడికి శిక్ష, బాధితురాలికి న్యాయం, సమాజానికి సామరస్యం — ఇదే మనందరి లక్ష్యం కావాలి.

*ఇట్లు,*
*మహమ్మద్ తాజుద్దీన్*
*బీఆర్ఎస్ పార్టీ మాజీ ముస్లిం మైనారిటీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు*

No comments:

Post a Comment