సూర్యోపాసన మరియు మాఘమాస విశిష్టత
భారతీయ సనాతన ధర్మంలో తత్త్వచింతన, దైవభావన మరియు ఉపాసనా సంప్రదాయాలన్నీ ప్రత్యక్ష దైవమైన సూర్యుని కేంద్రంగానే విస్తరించాయి. భౌతికంగా అగ్నిగోళంగా కనిపించే సూర్యుడు, వైజ్ఞానికంగా ప్రాణశక్తి కేంద్రం మరియు ఆధ్యాత్మికంగా సర్వదేవతా స్వరూపమైన పరంజ్యోతి.
సౌరశక్తి మరియు కాలగణన:
ఋషులు సూర్యమండలంలోని దివ్యశక్తులను గ్రహించి కాలగణనను ఏర్పరిచారు. సూర్యోదయం నుండి మరుసటి సూర్యోదయం వరకు ఒక రోజుగా పరిగణించడం మన శాస్త్రీయ పద్ధతి. ఏ గ్రహ హెూరలో సూర్యోదయం జరుగుతుందో దానిని బట్టి ఆ దిన నామం (ఆది, సోమ, మంగళ తదితర వారాలు) నిర్ణయించబడింది. సూర్యునిలోని ఏడు రకాల శక్తులే ఈ ఏడు వారాలుగా గోచరిస్తాయి.
చారిత్రక నేపథ్యం - ఆదివారం:
సూర్యహెూరలో ఉదయం జరిగే ‘ఆదివారం’ అత్యంత మహిమాన్వితమైనది. ప్రాచీన కాలంలో ఐరోపాలో కూడా సూర్యుని ‘మిత్ర’ పేరుతో ఆరాధించేవారు. కాలక్రమేణా అక్కడ కొత్త మతాలు వచ్చినా, ప్రజలలో పాతుకుపోయిన ఆదివారపు అనుబంధం కారణంగా, ఆ రోజునే తమ ప్రార్థనా దినంగా మార్చుకున్నాయి. కానీ మన పురాణాలలో ఆదివార వ్రతాలు అనాదిగా ఉన్నాయి. సూర్యనమస్కారాలు ఆరోగ్యప్రదాయని ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైంది.
మాఘమాసం - రథసప్తమి విశిష్టత:
సంవత్సరాన్ని ఒక రోజుగా భావిస్తే, అందులో మాఘమాసం ప్రాతఃకాలం వంటిది. అందుకే ఈ మాసంలో సూర్యారాధన, నదీ స్నానాలు విశిష్టమైనవి. సప్తమి తిథి సూర్యునికి ప్రీతికరమైనది. మాఘ శుద్ధ సప్తమినే ‘రథసప్తమి’ అంటారు. సూర్య గమనంలో వచ్చే మార్పుకి, కిరణ ప్రసారంలోని ప్రభావానికి ఇది సంకేతం.
• ఈ రోజు చేసే సూర్యారాధన సంవత్సరం మొత్తం చేసిన ఫలాన్నిస్తుంది.
• రాగి పాత్ర ద్వారా అర్ఘ్యం, ఎర్రచందనం, ఎర్రని పూలతో అర్చన చేయడం శ్రేష్టం.
• సూర్యకాంతి పడేలా ఆరుబయట పిడకలపై ఆవుపాల పాయసం వండి నివేదించడం ఆచారం. ఇది వైద్య మరియు దైవిక రహస్యం కలిగిన ప్రక్రియ.
పురాణ నిదర్శనాలు:
రామాయణంలో రాముడు ‘ఆదిత్యహృదయం’తో విజయం సాధించగా, భారతంలో ధర్మరాజు సూర్యానుగ్రహంతో అక్షయపాత్రను పొందాడు. శ్రీకృష్ణుని కుమారుడు సాంబడు, మయూర కవి సూర్యోపాసనతో ఆరోగ్యాన్ని పొందారు. త్రిమూర్తులు, సకల దేవతలు ఆదిత్యునిలోనే ఉన్నారని, ఆయనే ఏకైక సత్యమని వేదాలు ఘోషిస్తున్నాయి.
@ సామవేదం షణ్ముఖశర్మ
No comments:
Post a Comment